కృతికర్త : శ్రీతాళ్లపాక అన్నమాచార్య రాగం : భైరవి పల్లవి : ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము రామ రామభద్ర సీతారమణ సర్వేశ చరణం 1 : వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే అరయ విరిగె వీపు లసురలకు వరుస వనవాసపువ్రతము వట్టినపుడె పరులమతుల భీతి వట్టె రఘురామ॥ఏమ॥ చరణం 2 : వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే చొచ్చిరి పాతాళ మసురలెల్లాను ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ॥ఏమ॥ చరణం 3 : అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ॥ఏమ॥