కృతికర్త : శ్రీతాళ్లపాక అన్నమాచార్య
రాగం : భైరవి
పల్లవి:
ఏమని చెప్పఁగవచ్చు నిదివో నీ ప్రతాపము
రామ రామభద్ర సీతారమణ సర్వేశ
చరణం 1:
వెరవున హరువిల్లు విరుఁగఁ దీసిననాఁడే
అరయ విరిగె వీపు లసురలకు
వరుస వనవాసపువ్రతము వట్టినపుడె
పరులమతుల భీతి వట్టె రఘురామ॥ఏమ॥
చరణం 2:
వచ్చి నీవు దండకావనము చొచ్చిననాఁడే
చొచ్చిరి పాతాళ మసురలెల్లాను
ముచ్చటాడి చుప్పనాతిముక్కు గోసిననాఁడే
కొచ్చి దైత్యు లాసదెగఁ గోసిరి శ్రీరామ॥ఏమ॥
చరణం 3:
అడరి మారీచుపై నమ్ము విడిచిననాఁడే
విడిచిరి దానవులు వేడుకలెల్లాను
బడి విభీషణునిఁ జేపట్టితే రక్కసులెల్లా
చిడిసి మల్లెవట్టిరి శ్రీవేంకటరామ॥ఏమ॥
Comments
Post a Comment